Tuesday, 13 December 2016


టీ–హబ్‌ వేదికగా ఉబెర్, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ చేతులు కలిపాయి. మెట్రో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఉబెర్‌ ఫౌండర్, సీఈవో ట్రావిస్‌ కలనిక్‌ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. నగరంలో గమ్య స్థానానికి చేరుకోవడం పెద్ద సవాల్‌ అని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. ప్రయాణికులు త్వరితగతిన, సౌకర్యంగా గమ్యానికి చేరుకోవడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానమే తనను ఇక్కడికి వచ్చేలా చేసిందని ట్రావిస్‌ తెలిపారు. 2 వేల మందికిపైగా ఉద్యోగులతో ఉబెర్‌ రెండో అతిపెద్ద కేంద్రం ఇక్కడ ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 75,000 ఉబెర్‌ క్యాబ్స్‌ పరుగెడుతున్నాయని చెప్పారు. కాగా, టీ–హబ్‌లోని స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో ట్రావిస్‌ సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరులో టీ–హబ్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఉబెర్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం కింద 20 స్టార్టప్‌ కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వచ్చేందుకుగాను మెంటార్‌గా కంపెనీ వ్యవహరిస్తోంది.

హైదరాబాద్‌లో ఉబెర్‌ బైక్‌ షేరింగ్‌
హైదరాబాద్‌లో ఉబెర్‌ బైక్‌ షేరింగ్‌ ఉబెర్‌ మోటోను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో బైక్‌లను నడుపుతున్న కేటీఆర్, ట్రావిస్‌
• కిలోమీటరుకు రూ.5 చార్జీ
• హైదరాబాద్‌ మెట్రోతో ఒప్పందం
• ప్రారంభించిన తెలంగాణ సీఎం
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌ హైదరాబాద్‌లో బైక్‌ షేరింగ్‌ సేవలను ఆవిష్కరించింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారమిక్కడ ప్రగతి భవన్‌లో జెండా ఊపి ఉబెర్‌ మోటోను ప్రారంభించారు. 2017 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ ఇప్పటికే గుర్‌గావ్, బెంగళూరులో ఈ సర్వీసులను అందిస్తోంది. మొదటి మూడు కిలోమీటర్లకు రూ.20 వసూలు చేస్తారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.5 చార్జీ ఉంటుంది.
ఉబెర్‌ మోటో సేవల కోసం తొలుత 100 ద్విచక్ర వాహనాలు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఉబెర్‌ యాప్‌లోనే మోటో ఆప్షన్‌ను నిక్షిప్తం చేశారు. యాప్‌లో పిక్‌ అప్‌ ప్రాంతం, చెల్లింపు విధానాన్ని నిర్దేశించి రైడ్‌ రిక్వెస్ట్‌ పంపాలి. డ్రైవర్‌ పేరు, ఫొటో, వాహనం వివరాలు కస్టమర్‌ మొబైల్‌లో ప్రత్యక్షమవుతాయి. నగదు, వాలెట్, కార్డుతో బిల్లు చెల్లించొచ్చు. సుశిక్షితులైన డ్రైవర్లను నియమిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ సౌకర్యం ఉంది. ట్రిప్‌ వివరాలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపుకోవచ్చు.

No comments:

Post a Comment